భారత్ - చైనా బలగాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన కల్నల్ అధికారితో పాటు.. మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు.
బి. సంతోష్ బాబు తల్లిదండ్రులు సూర్యాపేటలో నివసిస్తుంటే, సంతోష్ కుటుంబం మాత్రం ఢిల్లీలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి మంజుల స్పందించారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు.
తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. నిజానికి తన కుమారుడు చనిపోయాడన్న వార్త తన కోడలికి సోమవారం రాత్రే చెప్పారని, కానీ, తాను తట్టుకోలేనని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చెప్పారని కన్నీటిని పంటి బిగువున పెట్టి వివరించింది.