భారత్ చైనాల మధ్య యుద్ధ ఘర్షణ నెలకొంది. ఇరు దేశాలకు చెందిన సైనికులు గత రాత్రి లడఖ్ సరిహద్దుల్లో తలపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని భారత ఆర్మీ చెబుతోంది. ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది.
అయితే, చైనా మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' భిన్నవాదనలు వినిపిస్తోంది. లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మందికి గాయాలయ్యాయని ఓ కథనంలో పేర్కొంది. 'గ్లోబల్ టైమ్స్' సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదని కూడా ఆ మీడియా సంస్థ తెలిపింది.
వాస్తవానికి లడఖ్ వద్ద కొన్ని వారాలుగా భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా లడఖ్ వద్ద పరిస్థితులు చక్కబడలేదు సరికదా, గతరాత్రి జరిగిన దాడి ఘటనతో మరింత వేడెక్కాయి. గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత ఆర్మీ స్పందించింది.
గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.