కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మొదలైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ఓట్ల లెక్కింపులోభాగంగా తొలుత 753 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కించనున్నారు.
ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించనున్నారు. కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏడు టేబుళ్ల చొప్పున 2 కేంద్రాల్లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 22 రౌండ్లలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది.
తొలుత హుజూరాబాద్ మండలంలోని గ్రామాల ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదట పోతిరెడ్డిపేట, ఆఖరున శంభునిపల్లి ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. తెరాస నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయోత్సవ ర్యాలీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.