Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు

తెలంగాణాలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు
, ఆదివారం, 17 అక్టోబరు 2021 (09:49 IST)
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ విషాయన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 
 
ముఖ్యంగా, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో పొడిగా ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. 
 
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 27న మరో అల్పపీడనం ఏర్పడి ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
 
ఇదిలావుంటే, ఏపీలోని ఉత్తరాంధ్రను వానలు వణికించాయి. శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లా వరకు శనివారం ఎడతెరిపిలేని వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడితే మరికొన్ని చోట్ల కుండపోత వాన కురిసింది. 
 
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతోనే ఈ వర్షాలు కురిశాయి. ఆది, సోమవారాల్లో కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం విజయవాడలో జోరున కురిసిన వానకు రోడ్లు జలమయం అయ్యాయి.
 
శుక్రవారం, శనివారం మధ్య శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇచ్ఛాపురంలో 11, మందసలో 9, సోంపేటలో 8, టెక్కలిలో 8, కళింగపట్నంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. నిన్న ఉదయం నుంచి రాత్రి మధ్య, తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 11.4, కొత్తపల్లిలో 10.2, శ్రీకాకుళం జిల్లా మందసలో 8.7, రాజాంలో 7.6, టెక్కలిలో 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
 
అలాగే, తిరుపతిలోనూ నిన్న వర్షం దంచికొట్టింది. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ స్తంభించింది. కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్టణం, విజయనగరం, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యాలో కరోనా విలయతాండవం... 24 గంటల్లో వెయ్యి మంది మృతి