తెలంగాణ హైకోర్టులో దసరా పండుగ వాతావరణం నెలకొంది. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం నియమించిన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు.
హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదికగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయమూర్తుల చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ప్రమాణం చేయించారు.
న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ పెరుగు శ్రీ సుధా, జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత, జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి, జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ ఎన్.తుకారాం జీ, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ పటోళ్ల మాధవి దేవీ ఉన్నారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత తొలిసారి ఏడుగురు న్యాయాధికారులకు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. కొత్త న్యాయమూర్తులు ఈ నెల 18న ప్రమాణం చేయాలని తొలుత భావించారు.
విజయదశమి పండుగ నాడు ప్రమాణం చేసేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపడంతో తేదీని శుక్రవారానికి మార్చారు. ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.