Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ నెల 17న ఘనంగా తెలంగాణ జాతిపిత జన్మదిన వేడుకలు: మంత్రి తలసాని

ఈ నెల 17న ఘనంగా తెలంగాణ జాతిపిత జన్మదిన వేడుకలు: మంత్రి తలసాని
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (21:49 IST)
తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
 
సోమవారం జన్మదిన వేడుకలకు వేదిక అయిన జలవిహార్ లో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ జీవిత చరిత్రను వివరించేలా త్రీడీ గ్రాఫిక్స్‌లో రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జి శ్రీ తలసాని సాయికిరణ్ యాదవ్‌తో కలిసి విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జలవిహార్‌లో నిర్వహించే జన్మదిన వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా 30 నిమిషాల వ్యవధి కలిగిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన 5 పాటలను ఎల్‌సిడి స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
 
అదేవిధంగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని బల్కంపేట ఎల్లమ్మకు దాతల సహకారంతో రెండున్నర కిలోల బంగారంతో తయారు చేయించిన చీరను ఎంఎల్‌సి కవితతో కలిసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మహిళలకు చీరాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
 
పార్సీగుట్టలోని బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారికి బంగారు కవచం అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలను  నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆద్వర్యంలో చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఇవే కాకుండా నాంపల్లి లోని యూసెఫిన్ దర్గాలో చాదర్ సమర్పించడం, గురుద్వార్‌లో గురుగ్రంద్ సాహెబ్‌కు గురుద్వారా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, గాంధీ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
జల విహార్‌లో నిర్వహించే ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్, శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ శ్రీ నేటి విద్యా సాగర్, మంత్రులు శ్రీ మహామూద్ అలీ, శ్రీ మల్లారెడ్డి, పలువురు ఎంపిలు, రాజ్యసభ సభ్యులు, పలువురు చైర్మన్లు, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్లతో పాటు తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌కు ఆ శక్తి ప్రసాదించమని శ్రీవారిని ప్రార్థించా: మంత్రి వేణుగోపాలక్రిష్ణ