మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఈ రోజు జరిగిన భారత్ బంద్ లో ఆయన మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ రహదారిపై పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రోడ్డుపై భైఠాయించారు. ఈ సనదర్భంగా భట్టి మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం రైతాంగ సోదరుల నడ్డి విరుస్తోందని అన్నారు. నల్ల ధనం వెనక్కి తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన బీజేపీ నాయకులు తరువాత వాటిని పూర్తిగా పక్కన పెట్టారని అన్నారు.
ఏక కాలంలో రుణ మాఫీ చేసిన ఘనత మాదే
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్న భట్టి... రైతులకు ఏక కాలంలో రుణ మాఫీ చేసిందని అన్నారు. అంతేకాక రైతుల పెట్టుబడుల కోసం బ్యాంకులను ఇందిరమ్మ జాతీయం చేసిందని చెప్పారు. వ్యవసాయం బాగుండాలని, రైతులు కోసం నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ఎన్నో భారీ ప్రాజెక్టులు కట్టిందని అన్నారు. రైతులకు అండగా నిలిచింది పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పారు.
కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని భట్టి వివరించారు. మోడీ తెచ్చిన మూడు చట్టాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉందని అన్నారు. సామాన్యుడు ఎక్కడో గుజరాత్ కో, ఉత్తర ప్రదేశ్ కో వెళ్లి పంటను అమ్ముకోలేడని చెప్పారు. ఇది కేవలం అంబానీ, ఆదానీల వంటి కార్పొరేట్ల కోసమే ఈ చట్టాలు తెచ్చారని అన్నారు.
నేను చెప్పిన పంటనే వేయాలని రైతులను కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కి కూడా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతుల ఆందోళన కి భయపడి నేను కూడా మద్దతు ఇస్తా అని కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని అన్నారు.
మోడీ చేసిన చట్టం దేశం అంతా ఆందోళనలో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాసనసభను వెంటనే సమావేశ పరచి.. ఈ చాటాలని వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.