Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పీహెచ్‌డీ చేస్తూనే ఏకంగా నాలుగు ఉద్యోగులకు ఎంపికైన యువకుడు

jobs

ఠాగూర్

, ఆదివారం, 3 మార్చి 2024 (10:06 IST)
పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఓ యువకుడు నిరూపించాడు. విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తూనే ఏకంగా నాలుగు ఉద్యోగులకు ఎంపికయ్యాడు. ఆ యువకుడి పేరు మహిపాల్. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా నవాబు పేట మండలం, పులిమామిడికి చెందిన లక్ష్మీగళ్మ అంజయ్య - అనంతమ్మల కుమారుడు మహిపాల్. విశ్వవిద్యాలయంలో ఓవైపు పరిశోధన కొనసాగిస్తూ, మరోవైపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఓకేసారి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. 
 
మహిపాల్‌ చిన్ననాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం సాగించాడు. డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తిచేసి 2015 నుంచి 2017 వరకు ఓయూలో చదివాడు. పీజీలో ఉండగానే యూజీసీ నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)లో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)గా ఎంపికై ఆర్ట్స్‌ కళాశాలలో పీహెచ్‌డీ ప్రవేశం పొందాడు. పీజీకి, పీహెచ్‌డీకి మధ్యలో బీఈడీ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుండగా 2018లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది.
 
అయితే, అందులో చేరకుండా ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్న లక్ష్యంతో ముందుకుసాగాడు. యూనివర్సిటీ అందించే ఉపకార వేతనంతో బయట స్టడీహాల్‌లో ఉదయం 9 నుంచి రాత్రి 12 వరకు కఠోర సాధన చేసేవాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల ఉద్యోగ ఫలితాల్లో టీజీటీ, పీటీజీ, జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ ఇలా ఏకంగా నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆర్ట్స్‌ కళాశాలలో ఆచార్య నిత్యానందరావు పర్యవేక్షణలో 'వడ్డెపల్లి కృష్ణగేయాలు-సమగ్ర అధ్యయనం' అన్న అంశంపై ఇటీవలే తన పరిశోధన గ్రంథాన్ని అందజేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ బీచ్‌లో మళ్లీ కలకలం. ఫ్లోటింగ్ బ్రిడ్జి చెల్లాచెదురు