Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ బీచ్‌లో మళ్లీ కలకలం. ఫ్లోటింగ్ బ్రిడ్జి చెల్లాచెదురు

Advertiesment
floting bridge

ఠాగూర్

, ఆదివారం, 3 మార్చి 2024 (09:57 IST)
విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి మళ్లీ కొట్టుకునిపోయింది. శనివారం మధ్యాహ్నం అల్లల ధాటికి ఈ వంతెన చెల్లాచెదురైంది. గత నెల 25న విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో వైకాపా నేతల సమక్షంలో ఈ వంతెనను ప్రారంభించారు. అనంతరం ఒక్క రోజులోనే 'టి జాయింట్‌' విడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారులు మాత్రం అలలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించి ఆ జాయింట్‌ను దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామని చెప్పుకొచ్చారు. 
 
అప్పటి నుంచి సందర్శకులను అనుమతించకుండా పరిశీలన కొనసాగిస్తున్నారు. పూర్తిస్థాయిలో సన్నద్ధత అయ్యాకే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు తేల్చారు. దీంతో కొందరు నిపుణులను రప్పించి లోపాలు తలెత్తకుండా ఎలా నిర్వహించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అది తెగిపోవడం చూసిన సందర్శకులు ముక్కున వేలేసుకున్నారు.
 
సముద్రంలో అలల తాకిడికి టీ జాయింట్‌ చెల్లాచెదురవగా నిర్వాహకులు దాన్ని అనుసంధానం చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. కొన్ని డబ్బాలు విడిపోయి బయటకు వచ్చేశాయి. దీంతో వాటిని పూర్తిగా బయటకు తీసి టీ జాయింట్‌పై ఉంచినట్లు తెలుస్తోంది. 'టీ జాయింట్‌' ఒకానొక సమయంలో నీటిలో మునిగిపోయినంత పరిస్థితి తలెత్తింది. కొంత సమయానికి తీరం వైపు తీసుకొచ్చినా ఒరిగిపోయి కనిపించడంతో చూసిన వారు ఆందోళన వ్యక్తం చేశారు.
 
వంతెనకు అనుసంధానంగా ఉన్న డబ్బాలు కొన్ని దెబ్బతిన్నాయి. మధ్యాహం మూడు గంటల సమయంలో అలలు వంతెన మీద నుంచి మూడు, నాలుగు అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అసలు ఇక్కడ ఏర్పాటు చేయడం అనుకూలమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 'నిపుణుల పర్యవేక్షణలో పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలో టీ జాయింట్‌ విడిపోయింది. అన్ని స్థాయిల్లో పరిశీలన సమగ్రంగా అయ్యాకే సందర్శకులను అనుమతించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు' అని అధికారులు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ లోక్‌సభ బీజేపి అభ్యర్థి మాధవీలత చేతిలో అసదుద్దీన్ ఓవైసి ఓటమి తప్పదా?