Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

lightning

ఐవీఆర్

, బుధవారం, 15 మే 2024 (21:09 IST)
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయగూడెంలో ఘోరం జరిగింది. క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. నీలాయగూడెంలోని గ్రామ శివారులో చిట్టీమల్లమ్మ పొలంలో 15 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్లు ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పెద్దగాలితో మేఘాలు పట్టుకొచ్చాయి.
 
వర్షం తుంపర్లు పడుతుండటంతో పిల్లలు కేరింతలు కొడుతూ హుషారుగా క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో పెద్దశబ్దంతో వారు ఆడుతున్న మైదానంలో పిడుగుపడింది. ఆ పిడుగు మర్రి రుషి అనే యువకుడి తలను తాకడంతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా హైదరాబాదులో బీటెక్ చదువుతున్న రుషి సెలవుల్లో సరదాగా అమ్మమ్మగారి ఊరులో గడుపుదామని వచ్చాడు. కానీ ప్రకృతి వైపరీత్యం అతడిని బలి తీసుకున్నది.
 
పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి?
ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు. సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది. భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
 
ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.
 
పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి. బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు. బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా