Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోన్ ట్యాపింగ్ కేసు సూత్రధారి ప్రభాక్ రావుకు అమెరికా గ్రీన్ కార్డు

prabhakar rao

ఠాగూర్

, శుక్రవారం, 8 నవంబరు 2024 (16:13 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్ రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైంది. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్షిప్ ప్రభాకర్ రావుకు తాజాగా గ్రీన్ కార్డు మంజూరైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. 
 
ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్టు చేయడంతోపాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. 
 
అనంతరం న్యాయస్థానంలో అభియోగపత్రం నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆయనకు మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
జూన్ నెలలో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని పేర్కొన్నారు. అయితే గడువు దాటినా రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో మూడు నెలల కాలపరిమితితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. 
 
ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్ పోర్టును సైతం రద్దు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్రావుకు అమెరికాలో గ్రీన్ కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది.
 
గ్రీన్‌కార్డు దారుకావడంతో ప్రభాకర్ రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన హైదరాబాదు వచ్చే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ MAGA మ్యాజిక్.. ఆయన పాలనలో భారత్ ఏం ఎదురుచూస్తోంది?