Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాలీవుడ్ అగ్ర నిర్మాత పేరు!!

Advertiesment
naveen-yerneni

వరుణ్

, సోమవారం, 15 ఏప్రియల్ 2024 (16:43 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని పేరు వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చింది. ఇందులోని బాధితుల్లో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులకు ఒక ఫిర్యాదు ఇ్చారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని తెలిపారు. పైగా, తన వద్ద ఉన్న షేర్లను బలవంతంగా వారు బదిలీ చేయించుకున్నారని చెప్పారు. వీరిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యర్నేని కూడా ఉన్నారని బాధితుడు తన ఫిర్యాులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి బలవంతంగా షేర్ల బదాలయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారంలో నవీన్ యర్నేని పేరు ఉన్నట్టు జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్‌తోపాటు పలువురిపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయం తెలుసుకున్న ఎస్ఆర్ఎస్ఐ, వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించి.. ట్యాపింగ్ కేసులోని పలువురు నిందితులు తనను గతంలో కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, గట్టుమల్లు, మల్లికార్జున్ తోపాటు కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, చంద్రశేఖర్ వేగేతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
 
ఈ వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు వేణుమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో డైరెక్టర్లకూ నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫ్రికా ఖండానికి కుర్చీని మడతపెట్టి ఫీవర్.. వీడియో వైరల్