Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అభినవ మొల్ల' - ప్రముఖ రచయిత్రి చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ ఇకలేరు..

Advertiesment
lakshmi narasamma
, శుక్రవారం, 8 డిశెంబరు 2023 (13:43 IST)
భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా.చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ (85) గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్ నగరంలో చికిత్స చేయించారు. కొద్దిగా కోలుకున్నాక ఇంటి దగ్గరే వైద్యసేవలు అందిస్తున్నారు. గురువారం ఉదయం ఊపిరి తీసుకోవడం కష్టమై ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి సాహితీవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
 
భద్రాద్రి రామాలయ ప్రధానార్చకుడిగా పనిచేసిన పొడిచేటి వీరరాఘవాచార్య, నర్సమాంబ దంపతులకు 1939 జనవరి 3న లక్ష్మీనరసమ్మ జన్మించారు. ఆమెకు తొమ్మిదేళ్లకే బాల్య వివాహమైంది. కాపురానికి వెళ్లిన కొద్ది కాలానికి అత్తవారింట్లో వేధింపులు ఎక్కువై పుట్టింటికి చేరారు. అనంతరం ప్రైవేటుగా మెట్రిక్ ఉత్తీర్ణురాలై.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందారు. విద్యాభ్యాసం కొనసాగించి.. తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా, బెంగళూరు కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 
 
మహాత్మా గాంధీ మృతి చెందిన సమయంలో తొలి కవిత రాసిన లక్ష్మీనరసమ్మ.. జీవితాంతం రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. పలు పత్రికల్లో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి. భద్రగిరి, సమతాభిరామం, శ్రీపదం, అక్షర తర్పణం, మారుతీ సుప్రభాతం, నీరాజనం, సమస్యా పూరణం, మధువని, కావ్య గౌతమి, స్వరార్చన, గోదా కల్యాణం, భద్రాచల క్షేత్రచరిత్ర, తులసీదళాలు, మాతృభూమి, కవితా ధనుస్సు, శాంతిభిక్ష, రామదాసు వంటి రచనలు ఆమెకు పేరు తెచ్చాయి. 
 
హరికథలు, నాటికలు, నాటకాలు, ఖండ కావ్యాలు, భక్తి గీతాలు, నానీలు, సంగీత రూపకాలు ఇలా అన్నింటా తనదైన శైలిని చాటారు. ఆ రచనలు కవయిత్రి మొల్ల శైలిలో ఉండడంతో ఆమెకు 'అభినవ మొల్ల' అనే బిరుదును కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి బహూకరించారు. లక్ష్మీనరసమ్మ సాహిత్యంపై ఇప్పటికే ఇద్దరు ఎంఫిల్ చేశారు. మరొకరు జీవిత చరిత్రను రాస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్... ఎడమ తుంటికి ఫ్రాక్చర్