తెలంగాణ పర్యటన సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఎదుర్కొన్న వేధింపులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ సంఘటన రాష్ట్ర సాంస్కృతిక నైతికతకు విరుద్ధమని అభివర్ణించారు. మిస్ వరల్డ్ పోటీదారునికి ఆయన తన సంఘీభావాన్ని తెలియజేశారు. మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
"మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికపై స్త్రీ ద్వేషపూరిత ప్రవర్తనను బహిరంగంగా ప్రకటించడానికి చాలా ధైర్యం అవసరం" అని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ అందాల కార్యక్రమంలో మిల్లా మాగీ తన అసహ్యకరమైన అనుభవాన్ని బహిరంగంగా వెల్లడించడంపై కేటీఆర్ కాంగ్రెస్ సర్కారు వైఫల్యంగా ఎండగట్టారు. మ్యాగీకి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "మిల్లా మాగీ, నువ్వు చాలా బలమైన మహిళవి, మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను గౌరవించడం, వృద్ధికి సమాన అవకాశాలను అందించడం అనే గొప్ప సంస్కృతిని ఆయన ఉదహరించారు.
"మన భూమి నుండి వచ్చిన గొప్ప నాయకులలో కొందరు రాణి రుద్రమ మరియు చిట్యాల ఐలమ్మ వంటి మహిళలు. దురదృష్టవశాత్తు, మీరు అనుభవించినది నిజమైన తెలంగాణను సూచించదు. మీరు త్వరలో కోలుకుంటారని నేను ఆశిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు.
ఒక ఆడపిల్ల తండ్రిగా, ఏ స్త్రీ లేదా అమ్మాయి ఇలాంటి భయంకరమైన అనుభవాలను ఎప్పుడూ అనుభవించకూడదని కోరుకున్నారు. బాధితురాలిపై నిందలు వేయడాన్ని కేటీఆర్ ఖండించారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇకపోతే.. మిల్లా మ్యాగీ . వయసు 24 ఏండ్లు. వృత్తిరీత్యా స్విమ్మర్. ప్రపంచ సుందరి కిరీటాన్ని ముద్దాడాలని చిన్నప్పటి నుంచి ఆమెకు ఎంతో ఆశ. అందుకుతగ్గట్టే తన ఉన్నత విద్య ముగియగానే 2024లో మిస్ ఇంగ్లండ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.
దీంతో హైదరాబాద్ వేదికగా జరిగే మిస్ వరల్డ్-2025 పోటీల్లో ఇంగ్లండ్ తరుఫున పాల్గొనడానికి ఈ నెల 7న నగరానికి వచ్చింది. అయితే పదిరోజులు తిరక్కముందే మే 16న పోటీల నుంచి వైదొలుగుతూ ఇంగ్లండ్‌కు వెళ్లిపోయింది. వ్యక్తిగత, ఆరోగ్య కారణాల దృష్ట్యా పోటీల నుంచి వైదొలుగుతున్నట్టు మ్యాగీ తొలుత ప్రకటించింది.
అయితే ఓ ఇంటర్వ్యూ మిల్లా మ్యాగీ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో పాల్గొనడానికి మే 7న నగరానికి చేరుకున్నట్టు చెప్పారు. పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలు పాత కాలం తరహాలో, అధ్వానంగా ఉన్నట్టు వాపోయారు. తమను ఎగ్జిబిషన్లో గ్లామర్ బొమ్మలుగా ట్రీట్ చేస్తూ 24 గంటలపాటూ మేకప్, బాల్ గౌన్లతోనే ఉండమంటూ నిర్వాహకులు ఒత్తిడి తెచ్చేవారని వాపోయారు.
మధ్యవయస్కులైన పురుషుల ముందు తమను పరేడ్ చేయించేవారని వాపోయారు. డబ్బు ఉన్న కొందరు ధనవంతులు కూర్చున్న టేబుల్ల దగ్గర తమను గంటలపాటు ఉండాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారని చెప్పారు. మొత్తంగా నిర్వాహకుల తీరుతో నేనేమైనా వేశ్యనా ఏంటి? అనే భావన నాకు కలిగింది అని మ్యాగీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.