ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి మరో కీలక పోస్టు వరించింది. ఇప్పటికే ఆమె హెచ్ఎండీఏ ఐటీ, ఎస్టేట్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఇపుడు కొత్తగా మరో కీలక బాధ్యతలను మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అప్పగించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం దాన కిశోర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ప్రస్తుతం హెచ్ఎండీఏ అదనపు కమిషనరుగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న దాన కిశోర్ ఈ నెల ఆరో తేదీన హెచ్ఎండీఏపై పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ క్షణం తీరిక లేకుండా గడిపారు. వివిధ ప్రాజెక్టులు, అత్యవసరంగా పరిష్కరించాల్సిన దరఖాస్తులను ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. ఆ తర్వాత హెచ్జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలిని నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు.