హైదరాబాద్ నగరంలోని పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో 36 మంది కార్మికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరో 34 మంది గాయపడ్డారని సమాచారం. అయితే, మరో 13 మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. వీరంతా మిస్సింగ్ అయినట్టు సమాచారం.
అదేసమయంలో ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతుండగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన బాధిత కుటుంబాలకు అందిస్తున్నట్టు వివరించారు.
అయితే, ఈ ప్రమాదం తర్వాత 13 మంది కార్మికులు కనిపించకుండా పోయారని సమాచారం. ప్రమాదం సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, సిబ్బంది సంఖ్యపై గందరగోళం నెలకొంది. అధికారవర్గాల సమాచారం ప్రకారం పేలుడు సంభవించిన సమయంలో 143 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.
అలాగే, ఈ ప్రమాదంలో చనిపోయినవారిలో మృతదేహాల ఆధారంగా 14 మంది చనిపోయారని అధికారంగా ప్రకటించారు. మిగతా మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, కంపెనీ మాత్రం ఆ సమయంలో 156 మంది విధుల్లో ఉన్నారని చెబుతోంది. మరో 13 మంది సిబ్బంది కనిపించడం లేదని తెలిపింది.
ఫ్యాక్టరీలో శిథిలాల తొలగింపు పూర్తయ్యాకే ఈ 13 మంది కార్మికులు, సిబ్బందికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సిగాచీ రసాయన కర్మాగారం వద్ద మూడో రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.