టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డిని అర్థరాత్రి అరెస్టు చేయడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రవరీ గోడ దూకి, పడక గది తలుపులు పగులగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తెలంగాణ పోలీసులను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎస్పీని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.
అలాగే, వికారాబాద్ ఎస్పీగా అవినాష్ మహంతిని నియమించింది. అన్నపూర్ణను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. అన్నపూర్ణకు ఎన్నికల విధులకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించరాని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఆదేశించారు.
కాగా, కొడంగల్‌లోని రేవంత్ ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున పోలీసులు చొరబడి అరెస్ట్ చేయడాన్ని కాంగ్రెస్ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక తెప్పించుకున్న ఈసీ.. ఈ మేరకు చర్యలు చేపట్టింది. అన్నపూర్ణను బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సీఈసీ ఆదేశించింది.