ఓ వైపు జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా జరుగుతుండగా.. మరోవైపు కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యోలో మంగళవారం 2,848 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి జపాన్ రాజధానిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిశారని అధికారులు తెలిపారు.
అయితే.. కోవిడ్-19 నిబంధనల మధ్య టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కాగా కరోనాలోని డెల్టా వేరియంట్ కారణంగానే వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోందని.. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
దీంతోపాటు కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నమోదైన 12,635 కోవిడ్ -19 కేసుల్లో.. 20.8% మంది రోగులు ఆసుపత్రి పాలయ్యారని.. టోక్యోలో మహమ్మారి నియంత్రణకు అత్యవసర పరిస్థితిని విధించడం నయమంటూ అధికారుల ప్యానెల్ ప్రభుత్వానికి సూచించింది.
ఇదిలాఉంటే.. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో కూడా కరోనా ఆందోళనకు గురిచేస్తోంది. టోక్యో ఒలింపిక్స్ గ్రామంలో మంగళవారం 7 కొత్త కేసులు నమోదైనట్లు నిర్వాహకులు వెల్లడించారు. వారిలో నలుగురు అథ్లెట్లు, మరో ఇద్దరు సహాయకులని నిర్వాహకులు తెలిపారు.