Gukeshs Fathers Reaction ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో గుకేశ్ దొమ్మరాజు విశ్వవిజేతగా నిలిచాడు. తన కుమారుడు విశ్వవిజేత అయ్యాడు అనే మాట వినేందుకు గుకేశ్ తండ్రి ఎంతలా సతమతమయ్యాడో కళ్లకు కట్టినట్టు ఓ వీడియో చూపిస్తుంది. స్టేడియంలో తన కుమారుడు ప్రత్యర్థితో పోటీపడుతుంటే, గుకేశ్ తండ్రి మాత్రం బయట ఎంతగానో టెన్షన్‌కు గురవుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. స్వాతి రెడ్డి అనే ట్విటర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 'నిజంగా తన కొడుకు వరల్డ్ చెస్ రారాజు కాబోతున్నాడు అనే మాట వినడం కోసం ఆ తండ్రి ఎంత సతమతమయ్యాడో చూడండి" అనే క్యాప్షన్ పెట్టారు.
మరోవైపు, గుకేశ్‌పై ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా అత్యంత చిన్న వయసులో 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు గుకేశ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.
తాజాగా టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్‌టీఆర్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తదితరులు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా గుకేశ్‌ను అభినందించారు.
"వావ్.. జస్ట్ వావ్! నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గుకేశ్.. వాట్ ఎ ఫెనామినల్ ఫీట్! భారతదేశం మీ గురించి గర్విస్తోంది! 18 సంవత్సరాల వయస్సులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్. చరిత్రలో 2వ భారతీయుడు మాత్రమే! అన్నింటికంటే పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా మారడం! మేరా భారత్ మహాన్!" అంటూ చిరు ట్వీట్ చేశారు.
"అభినందనలు గుకేశ్. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా అవతరించడం. ప్రపంచ వేదికపై దేశం గర్వించేలా చేశావు. జై హింద్!" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
అలాగే ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా గుకేశ్‌ను మెచ్చుకున్నారు. "చరిత్రకే చెక్‌మేట్ పడింది! చదరంగం చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు గుకేశ్‌కు అభినందనలు. భారతదేశం గర్వంతో వెలిగిపోతోంది! ఆఖరి గేమ్‌లో ప్రత్యర్థిపై అద్భుతంగా ఆడడం అనేది మా ఛాంపియన్ ప్రశాంతత, ధైర్యాన్ని తెలియజేస్తుంది" అని కమల్ ట్వీట్ చేశారు.