చిరంజీవి కెరీర్‌లోనే రూ.150 కోట్ల చిత్రం : 2017 టాలీవుడ్ హిట్స్ అండ్ ఫట్స్
తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 సంవత్సరం మంచి విజయాలనే తెచ్చిపెట్టింది. పెద్ద హీరోలకు, యువ కథానాయకులకు హిట్లను రుచి చూపించిన సంవత్సరంగా మిగిలిపోనుంది. మూస ధోరణికి స్వస్తిపలికి.. కొత్త అంశాలతో తెరకెక్కిన చ
తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 సంవత్సరం మంచి విజయాలనే తెచ్చిపెట్టింది. పెద్ద హీరోలకు, యువ కథానాయకులకు హిట్లను రుచి చూపించిన సంవత్సరంగా మిగిలిపోనుంది. మూస ధోరణికి స్వస్తిపలికి.. కొత్త అంశాలతో తెరకెక్కిన చిత్రాలకు ప్రేక్షక దేవుళ్లు బ్రహ్మరథం పట్టారు. ఈ యేడాది మొత్తం 244 చిత్రాలు రిలీజ్ కాగా, వీటిలో 175 స్ట్రైట్ చిత్రాలు ఉన్నాయి. మరో 69 చిత్రాలు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
ఈ సంవత్సరంలో తొలి శుక్రవారమైన జనవరి ఆరో తేదీన ఐదు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతికి ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు సందడి చేశాయి. వీటిలో జనవరి 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నటించిన "ఖైదీ నంబర్ 150"వ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. చిరంజీవి సినీ కెరీర్‌లో రూ.150 కోట్ల కలెక్షన్స్ చిత్రంగా నిలిచింది. ఆ మరుసటి రోజే బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రం రిలీజ్ అయింది. ఇద్దరు అగ్రనటులకు చెందిన చిత్రాలు రిలీజైన మరుసటి రోజే శర్వాంద్ నటించిన "శతమానంభవతి", ఆర్.నారాయణ మూర్తి నటించి "హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య" చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో శర్వానంద్ మాత్రమే ప్రేక్షకులకు సంక్రాంతి విందు భోజనంపెట్టాడు.
ఇక ఫిబ్రవరి నెలలో నాని నటించిన "నేను లోకల్" విడుదలకాగా, ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించడమేకాకుండా, రూ.50 కోట్ల క్లబ్‌లో కూడా చోటుదక్కించుకుంది. ఇదే నెలలో ఎన్నో ఆశల మధ్య రిలీజైన భక్తిరస చిత్రం "ఓం నమో వేంకటేశాయ". నాగార్జున హీరోగా నటించగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఈ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో దగ్గుబాటి రానా నటించిన "ఘాజి" చిత్రం మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుని ఓ మంచి వైవిధ్యభరితమైన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం పూర్తిగా సబ్‌మెరైన్ నేపథ్య కథతో తెరకెక్కి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందింది. ఈ నెలలోనే "విన్నర్"గా వచ్చిన సాయి ధరమ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.
ఇక మార్చి నెలలో పవన్ కళ్యాణ్ నటించిన "కాటమరాయుడు", మంచు మనోజ్ హీరోగా "గుంటూరోడు", విక్టరీ వెంకటేష్ నటించిన "గురు", పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'రోగ్' చిత్రాలతో పాటు మొత్తం 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఈ యేడాదిలో అత్యధిక చిత్రాలు విడుదలైన నెలగా మార్చి మిగిలిపోయింది. అలాగే, 'గురు' రీమేక్‌తో వెంకటేష్ తనకున్న 'రీమేక్‌ల కింగ్' పేరును మరోమారు సార్థకం చేసుకున్నారు.
ఏప్రిల్ నెలలో వరుణ్ తేజా నటించిన "మిస్టర్" (ఏప్రిల్ 14), ప్రభాస్ - రానా కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "బాహుబలి 2" చిత్రం (ఏప్రిల్ 28) విడులయ్యాయి. వీటిలో 'మిస్టర్' పూర్తిగా నిరాశపరచగా, 'బాహుబలి 2' చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. మే నెలలో శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "రాధా", అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వం వహించిన అడల్ట్ చిత్రం "బాబు బాగా బిజీ", నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ నటించిన "రారండోయ్ వేడుక చూద్ధాం" చిత్రాలు, వ్యభిచారం కేసులో పట్టుబడిన శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ వెండితెరపై కనిపించిన "మిక్చర్ పొట్లం" చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో 'రారండోయ్ వేడుక చూద్ధాం' చిత్రంతో చై - రకుల్ సందడి చేయగా, 'బాబు బాగా బిజీ' చిత్రంలో హీరోయిన్లుగా నటించిన తేజస్వీ మదివాడ, మిస్తీ చక్రవర్తిలు తమ అందచందాలతో కుర్రకారును మరింతగా రెచ్చగొట్టారు.
జూన్ నెలలో అల్లు అర్జున్ "డీజే"గా ఆలరించాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాడు. జూలై నెలలో నాని హీరోగా వచ్చిన "నిన్నుకోరి", నారా రోహిత్ నటించిన "శమంతకమణి", వరుణ్ తేజా నటించిన "ఫిదా" చిత్రాలు బాక్సాఫీస్ హిట్స్ సాధించాయి. వరుణ్ తేజే సినీ కెరీర్‌లోనే 'ఫిదా' బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, రూ.90 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ సాయి పల్లవి ప్రేక్షకులను తన నటనతో నిజంగానే ఫిదా చేసేసింది.
ఇక ఆగస్టునెలలో బెల్లంకొడ సాయి శ్రీనివాస్ నటించిన "జయ జానకి నాయక", రానా నటించిన "నేనే రాజు నేనే మంత్రి", విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రాలు సైలెంట్ విజయాన్ని అందుకున్నాయి. సెప్టెంబర్ నెలలో బాలకృష్ణ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "పైసా వసూల్". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసి నిర్మాతకు పైసలు వసూలు చేయకుండానే పోయింది. ఇదే నెలలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం రూ.వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినప్పటికీ.. జీఎస్టీ పన్ను దెబ్బకు బలైంది. అలాగే, మహేష్ నటించిన "స్పైడర్" కూడా ఫ్లాట్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ రూ.150 కోట్లను కలెక్షన్స్ చేసింది. శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రం "మహానుభావుడు". ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించి మంచి సక్సెస్‌ను అందించాడు.
అక్టోబరు నెలలో వచ్చిన రవితేజ "రాజా ది గ్రేట్" ఫర్వాలేదనిపించింది. దర్శకుడు ఓంకార్ తీసిన చిత్రం "రాజుగారి గది 2''. ఇందులో నాగార్జున హీరో. ఈ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టాలని చూసినా అది సక్సెస్ కాలేదు. రామ్ హీరోగా నటించిన "ఉన్నది ఒక్కటే జిందగీ" చిత్రం కూడా ఆకట్టుకోలేక పోయింది. నవంబరు నెలలో డాక్టర్ రాజశేఖర్ "పీఎస్వీ గరుడవేగ" చిత్రంలో సుదీర్ఘకాలం తర్వాత ఓ మంచి విజయాన్ని రుచిచూశాడు. నారా రోహిత్ "బాలకృష్ణుడు"గా ఆలరించలేకపోయాడు. అలాగే, గోపీచంద్ గాలి (ఆక్సిజన్ మూవీ) సరిగా పీల్చలేక చతికిలపడ్డాడు.
చివరగా డిసెంబరు నెలలో సాయి ధరమ్ తేజ్ "జవాన్"గా వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హాస్య నటుడు సప్తగిరి "సప్తగిరి ఎల్ఎల్బీ" హాస్యభరిత చిత్రంగా మిగిలిపోగా, ఈ నెలాఖరులో "మిడిల్ క్లాస్ అబ్బాయి"(ఎంసీఏ)గా వచ్చిన నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే, ఈ చిత్రానికి పైరసీ దెబ్బపడింది. ఈ యేడాదికి చివరి చిత్రంగా అఖిల్ అక్కినేని హీరోగా 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ తీసిన చిత్రం "హలో" యూనివర్శల్ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా పరిచయమైంది. మొత్తంమీద 2017 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన చిత్రాలు సందడి చేస్తే నెలాఖరులో వచ్చిన 'ఎంసీఏ', 'హలో' చిత్రాలు సూపర్ హిట్లను అందుకున్నాయి. ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో ఆశలతో 2018లోకి అడుగు పెడుతోంది. ఈ యేడాది కూడా మరిన్ని విజయాలు వరించాలని కోరుకుందాం.