Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాజిక బాధ్యతపై (జే.డీ) వి.వి.లక్ష్మీనారాయణచే నాట్స్ వెబినార్

Advertiesment
Awareness
, మంగళవారం, 26 మే 2020 (15:26 IST)
ఫిలడెల్ఫియా: కరోనా మానవాళిపై పంజా విసురుతున్న వేళ సమాజం ఎలా స్పందించాలి..? సామాజిక బాధ్యత ఎలా ఉండాలి..? అనే అంశంపై ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ వెబినార్ నిర్వహించింది. సీబీఐ మాజీ డైరక్టర్ జేడీ లక్ష్మీనారాయణతో నాట్స్ నిర్వహించిన వెబినార్‌కు మంచి స్పందన లభించింది.
 
వేలమంది జూమ్, ఫేస్‌బుక్ ద్వారా అనుసంధానమైన ఈ వెబినార్‌ను వీక్షించారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో మనం సంక్షోభంలో కూడా అవకాశాలను చూడాలని లక్ష్మీనారాయణ సూచించారు. కరోనా విషయంలో ప్రస్తుతం అమెరికాతో పోల్చుకుంటే భారత్ ఎంతో సురక్షితంగా ఉందని ఆయన అన్నారు.
 
భారత్ ముందుస్తుగా లాక్‌డౌన్ అమలు చేయడంతో పాటు.. భారతీయ జీవన విధానమే భారతీయులకు రక్షణ కవచంలా మారిందని లక్ష్మీనారాయణ అన్నారు. కరోనా కమ్ముకుంటున్న ఈవేళ ఇప్పుడు భారతీయ జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. దీనిపై అమెరికాలో కూడా అక్కడ ఉంటున్న తెలుగువారు విస్తృతంగా ప్రచారం చేసి.. మన గొప్పతనాన్ని చాటాలన్నారు.
 
కరోనాపై పోరాటంలో మనలో రోగ నిరోధక శక్తి ఎంతో కీలకమని... ఆ రోగ నిరోధకశక్తిని ఎలా పెంచుకోవాలనే దానిపై అక్కడ ఉండే ప్రవాస భారతీయులు దృష్టి పెట్టాలని కోరారు. అలాగే భారత ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన ఆహారాన్ని కానీ భారతీయులు తమ ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి.. కరోనాపై పోరాడే శక్తి మన శరీరంలో పెరుగుతుందని వివరించారు. అలాగే కరోనా మనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు.
 
ఆన్‌లైన్ వాడకంలో ముందుండటంతో పాటు.. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు దేశంలో పల్లెల గురించి మనం ఆలోచించేలా చేస్తుందన్నారు. వలస కూలీలకు ఉపాధి హామీ పనిదినాలు పెంచడం.. స్థానిక ఉత్పత్తులకు పెద్ద పీట వేయడం.. ఇవన్నీ  కూడా భారత్‌కు కొత్త అవకాశాలే అని తెలిపారు. అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు కూడా పల్లెల్లో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు సృష్టించే కొత్త పరికరాలు, సాప్ట్‌వేర్‌లు కనిపెట్టాలని ఆయన సూచించారు.
 
అబ్ధుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని అడుగులు వేస్తే మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. అయితే అందుకు కావాల్సింది మనకు మన కుటుంబంతో, మన దేశంతో అనుబంధం పెంచుకోవడంతోనే వస్తుందన్నారు. బంధాలు ఎంత బలంగా ఉంటే మన భవిష్యత్తు కూడా అంత బలంగా ఉంటుందన్నారు. తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ సేవలు కూడా బాగున్నాయని లక్ష్మీనారాయణ ప్రశంసించారు. సామాజిక సేవ ఎలా చేయాలి..? ఎలా చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయనే దానిపై కూడా లక్ష్మీనారాయణ ఈ వెబినార్ ద్వారా దిశానిర్దేశం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నం ఏయే సమయాల్లో తింటే మంచిది..?