ఉదయం, సాయంత్రం రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలని వైద్యులు చెబుతున్నారు. మధ్యలో తిరిగి భోజనం చేయడం అదే పనిగా ఎక్కువగా అనేక సార్లు ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.
చతుర్వేద పురుషార్థాలను సాధించడానికి ఆరోగ్యం అవసరం. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి నియమిత ఆహార సేవనం అవసరం. సహజంగా కలిగే ఆకలిని నిరోధించడం వల్ల శరీరంలో అలసట, బలం, క్షీణించడం, నొప్పులు సంభవిస్తాయట. నిత్యం భుజించే ఆహార పదార్ధాలు మోతాదు భుజించే కాలం దాని వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
కొందరు జీవించడానికి మాత్రమే భుజిస్తారు. మరికొందరు కేవలం తినటానికే జీవిస్తారు. ఆహార సేవన నియమాలను పాటించకుండా అవసరానికి మించి భుజించినా అవసరమైన మేరకు ఆహారాన్ని గ్రహించకపోయినా దేశ కాల పరిస్థితులను అనుసరించి ఆహార నియమాలను పాటించకపోయినా మనిషి రోగగ్రస్తుడవుతాడు. మన దేశ కాల, శరీర ప్రకృతి, వయస్సును బట్టి ఆహార సేవనం చేస్తే జఠరాగ్ని ప్రజ్వరిల్లి ఆహారం బాగా జీర్ణమై శరీరానికి పుష్టి, బలం, ఆయువు, సుఖం కలుగుతాయట.