Newsworld It Itnews 0806 28 1080628033_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక సెలవా మరి : బిల్ గేట్స్

Advertiesment
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ కంప్యూటర్ విప్లవం
, శనివారం, 28 జూన్ 2008 (18:59 IST)
ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి శుక్రవారం వైదొలిగారు. మూడు దశాబ్దాల క్రితం పర్సనల్ కంప్యూటర్ విప్లవాన్ని పసిగట్టి హార్వార్డ్ యూనివర్శిటీ చదువును 1975లో వదిలిపెట్టిన బిల్‌గేట్స్ ప్రపంచంలో ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీసులో కంప్యూటర్ ఉండేలా చేయాలని కలకన్నారు.

బిల్‌గేట్స్ దార్శనికత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థగా మార్చింది. విండోస్ రూపకల్పనతో సాఫ్ట్‌వేర్ ప్రపంచాన్ని గేట్స్ తన హస్తగతం చేసుకున్నారు. కంప్యూటర్లు, సర్వర్లు, ఇంటర్నెట్ ఇలా అన్ని ఆవిష్కరణలకూ మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు తప్పనిసరి అయ్యేలా చేసిన గేట్స్ తనకు ఈ రంగంలో పోటీ లేకుండా చేసుకున్నారు.

సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తికాలం వినియోగించే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్‌లో తన కార్యకలాపాలకు బిల్ గేట్స్ వీడ్కోలు పలికారు. తన సంపదను అంతటినీ ఈ చారిటబుల్ సంస్థలోనే పెట్టిన గేట్స్, సంపద బాధ్యతలను పెంచుతుందని చెప్పేవారు.

సాఫ్ట్‌వేర్ రూపకల్పన, అభివృద్ధికి జీవితాన్ని ధారపోసిన గేట్స్ కొత్త వాక్సిన్‌లను కనుగొనడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మైక్రో ఫైనాన్స్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మిగిలిన జీవితాన్ని, శక్తిని వినియోగించనున్నారు.

అయితే మైక్రోసాఫ్ట్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా బిల్‌గేట్స్ సంస్థ ఛైర్మన్‌గా కొనసాగుతారు. ప్రత్యేక టెక్నాలజీ ప్రాజెక్టులపై కృషి చేస్తారు. మైక్రోసాఫ్ట్‌లో బిల్‌గే్ట్స్‌కి ఉన్న 8.7 శాతం వాటా విలువ 23 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది.

కంప్యూటర్ విప్లవంలో హార్డ్‌వేర్ కంటే సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యత పొందనుందని తొలిదశలోనే గ్రహించిన గేట్స్, తన చిరకాల మిత్రుడు పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ ‌సంస్థను ప్రారంభించారు. మైక్రో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ సంస్థ సాధించని విజయాలు, అందుకోలేని లక్ష్యాలు లేవంటే ఆతిశయోక్తి కాదు.

అయితే గూగుల్‌తో పోటీని తట్టుకోవడానికి యాహూను స్వాధీనం చేసుకోవాలని శతథా ప్రయత్నించి కూడా గేట్స్ భంగపాటుకు గురయ్యారు. వాటాల విలువ లెక్కింపులో తేడా రావడంతో యాహా కొనుగోలు వ్యవహారం అటకెక్కింది. మూడు దశాబ్దాల పాటు ప్రపంచ ఐటిని శాసించిన బిల్ గేట్స్ చివరకు పరాజయ భారంతో సంస్థకు వీడ్కోలు పలకడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu