మరో ఐదునిమిషాల్లో పెళ్లి జరుగబోతోంది. మంగళ వాయిద్యాలతో అన్నీ సిద్ధం చేశారు. ఇక పెళ్ళి అయిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి క్షణంలో వధువు పెళ్లి పీటలపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ సర్కిల్ భగత్ పూర్వ గ్రామం. సంజయ్, వనితలకు పెళ్ళి నిశ్చయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో బంధువులు తక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరయ్యారు.
గ్రామస్తులు కూడా పెద్దగా పెళ్ళికి రాలేదు. సామాజిక దూరంతో పెళ్ళి జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో మరికాసేపట్లో సంజయ్ వనిత మెడలో తాళికట్టాల్సి ఉంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వనిత కిందపడిపోయింది.
హుటాహుటిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కోవిడ్ పరీక్షలు చేస్తే తప్ప ఆమెను పరీక్షించమన్నారు. అయితే కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలోపల అత్యవసర విభాగానికి తీసుకుని వెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్థించారు. వనిత మరణంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.