Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలో ప్రియాంకా గాంధీ!!

Priyanka Gandhi

వరుణ్

, శుక్రవారం, 14 జూన్ 2024 (11:40 IST)
కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ రాజకీయ అరంగేట్రంపై ఉత్కంఠత నెలకొంది. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇక రాయబరేలీ, వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ సీటు వదులుకోనున్నారన్న వార్తల నడుమ మరోసారి ప్రియాంక ఎన్నికల ఆరంగేట్రంపై ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. రాహుల్ వయనాడ్ వదులుకంటే అక్కడి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
 
రాయబరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ భారీ మార్జిన్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రియాంక గాంధీ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠను మరింత పెంచాయి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సోదరి వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే మోడీ 23 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయి ఉండేవారని అన్నారు.
 
ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతారన్న వార్తలు 2019 లోక్‌సభ ఎన్నికల నుంచే మొదలయ్యాయి. అప్పట్లో ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారన్న కథనాలు వెలువడగా ఆమె వాటిని ఖండించారు. ఆ తర్వాత 2022 యూపీ ఎన్నికల సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తాను సీఎం అభ్యర్థిని కావచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఆ తర్వా తాను నోరు జారానంటూ వివరణ ఇచ్చారు.
 
ఇక ఈసారి ఎన్నికల ముందు సోనియా గాంధీ తన కంచుకోట రాయబరేలీ నియోజకవర్గం నుంచి తప్పుకుని రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక బరిలో దిగుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. రాహుల్ గాంధీ అమేథీ నుంచి స్మృతి ఇరానీపై పోటీ చేస్తారని కూడా భావించారు. ఈ విషయమై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వారిని కోరినట్టు కథనాలు వెలువడ్డాయి. 
 
గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరు గాంచిన నియోజకవర్గాల నుంచి పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్లొచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారట. అయితే, తాను బరిలో దిగబోనని ప్రియాంక మరోసారి స్పష్టం చేస్తూ ఊహాగానాలకు ముగింపు పలికారు. తనూ బరిలోకి దిగి గెలిస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు పార్లమెంటులో కాలుపెట్టినట్టు అవుతుందని, కుటుంబపాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీకి ఇది మరో ఆయుధంగా మారుతుందని ఆమె భావించారట.
 
వయనాడ్ నియోజకవర్గాన్ని రాహుల్ వదులుకుంటారా? లేదా? అన్న దానిపై ప్రియాంక గాంధీ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయమై తాను డైలమాను ఎదుర్కొంటున్నానని రాహుల్ గాంధీ బుధవారం మీడియాతో అన్నారు. అయితే, తన నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు సంతోషాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జిల్లాల వారీగా ప్రతి ఒక్కరినీ కలుస్తా : మంత్రి పవన్ కళ్యాణ్