ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారనే వార్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఖమ్మం నుంచి ఆమె పోటీ చేస్తారా లేదా అన్నది ఇపుడు సందిగ్ధంగా మారింది.
ఎందుకంటే.. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకా రెండు రోజులే సమయముంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభంకానుంది. శుభ ఘడియలున్నాయని తొలి రెండు రోజుల్లోనే నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
కానీ, ఇంతవరకూ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా ప్రకటించలేదు. ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తెలియక ప్రచారం అంతంతమాత్రంగా ఉంది. కరీంనగర్‌లో భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్, భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వినోద్ కుమార్ కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
వీరిని ఢీకొనే అభ్యర్థిని ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. వచ్చే నెల 11వ తేదీతో ముగిసే ప్రచారానికి ఇంకా కేవలం 25 రోజులే గడువుంది. ఈ మూడు స్థానాల అభ్యర్థుల పేర్లపై ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ నగరానికి వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దీపా దాసునీ చర్చించినట్లు సమాచారం.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం ఇంతకుముందే కోరారు. అయితే ఆమె ఖమ్మం బరిలో దిగే అవకాశాలు లేవని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద రెడ్డి లేదా రఘురామి రెడ్డిలలో ఒకరిని ఖమ్మం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల అంచనా.
ఖమ్మం సంగతి తేలితేనే కరీంనగర్ పేరు ఖరారు కానుంది. వీరిద్దరిలో ఒకరికి టికెట్ ఇస్తే కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్ రావు లేదా ప్రవీణ్ రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక హైదరాబాద్ టికెట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్‌కే ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను సోమవారం ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్ ఈ నెల 14నే రాష్ట్ర నేతలకు సమాచారమిచ్చినా జాబితా వెలువడలేదు. ఆ పేర్లను మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు.