చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరునిండ్రయూరులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వీధి శునకం కోసం ఏకంగా తన కుటుంబాన్నే దూరం పెట్టేశాడు. ఈ వీధి కుక్కను ప్రాణపదంగా పెంచుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని.. వీధి కుక్కను వదిలిపెట్టాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆయన నిరాకరించి, ఏకంగా కుటుంబ సభ్యులనే దూరం పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తిరునిండ్రయూర్ సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో సుందర్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆ కాలేజీకి సమీపంలోనే ఓ అద్దె ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి వుంటున్నారు. ఆయన ఓ వీధి కుక్కను చేరదీసి.. దానికి బ్లాకీ అనే పేరు పెట్టాడు. ఆ వీధి కుక్కకు కూడా యజమాని అంటే మాటల్లో చెప్పలేనంత విశ్వాసం. సుందర్ చేతిలో పెడితేనే అది ఆహారం తినేది. పక్కనే మాంసం ఉన్నా ఆయన అనుమతి లేనిదే ముట్టుకునేది కాదు.
అలాంటి వీధి కుక్కను వదిలిపెట్టాలను కుటుంబ సభ్యులు సుందర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి ఆయన అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆయనపై మరింత ఒత్తిడి పెరగడంతో ఆయన ఏకంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అలా గత తొమ్మిదేళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.