తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కాట్టేరిలో కూలిపోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ సాగుతోందని కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం లోక్‌సభలో ఒక పత్రికా ప్రకటన చేశారు.
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో మొత్తం 13 మంది చనిపోయారని చెప్పారు. వీరిలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్య మథులిక రావత్ సహా 11 మంది ఉన్నారని చెప్పారు.
ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ సులూరు ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు టేకాఫ్ అయిందన్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ట్రైనింగ్ సెంటరులో ల్యాండింగ్ కావాల్సివుందన్నారు.
కానీ, మధ్యాహ్నం 12.08 గంటల సమయంలో ఈ హెలికాఫ్టర్‌కు సులూరు ఎయిర్‌బేస్‌తో సంబంధాలు తెగిపోయాయని రాజ్‌నాథ్ సింగ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే హెలికాఫ్టర్ కూలిపోయిందని చెప్పారు.
ఈ ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. హెలికాఫ్టర్ పెద్ద శబ్దంతో కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించి, ప్రమాదస్థలికి పరుగులు తీశారని చెప్పారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ మొదలైందని చెప్పారు