మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తీర్చలేక పోవడంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. దీంతో అవమానభారంతో కుంగిపోయిన ఆ రైతు చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనుమాన్‌గఢ్‌కు చెందిన సురజరామ్(52) అనే రైతు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.6.5 లక్షల రుణం తీసుకున్నాడు. ఈ అప్పుతో పంట వేసినప్పటికీ గిట్టుబాటు కాలేదు. మరోవైపు రెండేళ్లలో ఈ అప్పును తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9 లక్షలకు చేరుకుంది. ఈ అప్పును తిరిగి చెల్లించలేక పోయాడు.
దీంతో అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ రైతు నుంచి స్పందనలేదు. దీంతో బ్యాంకు అధికారులు పోలీస్ స్టేషనులో కేసు పెట్టారు. ఫలితంగా పోలీసులు ఆ రైతును అరెస్టు చేశారు.
ఆ తర్వాత బెయిలుపై విడుదలైన సురజరామ్.. అవమానభారంతో కుంగిపోయి సోమవారం రాత్రి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.