మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠినమైన చట్టాలు వచ్చినా.. నేరాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఓ దుండగుడు అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. తనకు సహకరించలేదన్న ఆవేశంతో మహిళ కంట్లోకి ఆయుధాన్ని దించి రాక్షస ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పుణెలోని తహసీల్ అనే గ్రామంలో బుధవారం 37 ఏళ్ల ఓ మహిళ రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి మహిళను వెనకనుంచి పట్టుకొని బలవంతంగా వేరే చోటుకు లాక్కెల్లాడు.
అనంతరం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఈ దాడిని మహిళ ప్రతిఘటించింది. దీంతో కోపానికి గురైన దుండగుడు అతి కిరాతకంగా ఆమె కంట్లో బలమైన ఆయుధంతో పొడిచాడు. నొప్పితో బాధితురాలు గట్టిగా అరచడంతో స్థానికులు ఆమెను రక్షించడానికి వచ్చారు. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారవ్వగా.. స్థానికులు మహిళను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనలో బాధితురాలు చూపు కోల్పోయిందని వైద్యులు చెప్తున్నారు.
ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పుణె రూరల్ ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు.