ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం చేస్తోంది. అంటే కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధం చేస్తున్నాయి. మరోవైపు, చైనా మాత్రం భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతోంది. ఫలితంగా భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత భూభాగమైన లడఖ్‌కు ఆవల చైనా భారీ సంఖ్యలో బలగాలను మొహరించింది.
దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో పాటు.. త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా లడఖ్ వద్ద చైనా దుందుడుకు వైఖరిపైనే చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. అటు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సైతం త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ చీఫ్ లతో భేటీ కావడం సమస్య తీవ్రతను సూచిస్తోంది. ప్రభుత్వాధినేతలు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుండడంతో మొత్తానికి ఏదో జరుగుతోందన్న భావనలు ఢిల్లీ వర్గాల్లో కలుగుతున్నాయి.
కాగా, భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు ఇప్పటివికావు. గత 2017లో డోక్లామ్ వద్ద ఘర్షణల తర్వాత లడఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. లడఖ్ సమీపంలో చైనా భారీగా సైనికులను తరలిస్తుండడం, అక్కడి ఓ ఎయిర్ బేస్‌ను మరింత విస్తరించడం భారత్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈ కీలక సమావేశం నిర్వహించారు.