సంతానం కలగలేదనే కోపంతో భర్త భార్యను పక్కనబెట్టాడు. 12 ఏళ్లైనా సంతానం కలగకపోవడంతో భర్త అడ్డదారులు తొక్కాడు. ఆమెకు పిల్లలు కలగడం లేదనే అసహనంతో మరో మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాకుండా భార్యను వేధించేవాడు.
అయితే ఈ క్రమంలో ఇటీవలే అంజలి గర్భం దాల్చింది. ఇప్పుడామెకు తొమ్మిది నెలలు. కానీ ఆమె తన భర్త చెడు వ్యసనాలపై తరుచూ ప్రశ్నించేది. వేరే మహిళ దగ్గరకు వెళ్లుతున్నందుకు మందలించేది. ఇవన్నీ ఆ భర్తకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆమెను చంపడానికి పక్కాగా ప్లాన్ వేశాడు. భార్యను హతమార్చాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తొమ్మిది నెలల గర్భిణి అయిన అంజలిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తా అని చెప్పి బుధవారం సాయంత్రం పూట ఇంటినుంచి బయల్దేరాడు అఖిలేశ్. కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే.. ఆమెను అక్కడ ఉండమన్నాడు. పక్కనే ఉన్న ఇటుకలతో ఆమెపై దాడి చేశాడు. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా.. కడుపులో పెరుగుతున్నది తన బిడ్డేననే కనికరం లేకుండా కట్టుకున్న భార్యను ఇటుకలతో కొట్టి చంపాడు. అదీ చాలదన్నట్టు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అక్కడ్నుంచి పారిపోయాడు.
మరుసటి రోజు (గురువారం) ఉదయం ఆ గర్భిణీ ని కాలబెట్టిన ఊరులోని గ్రామస్థులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లేసరికి అంజలి మృతదేహం గుర్తుపట్టకుండా కాలిపోయి ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆమె ఆనవాళ్లను గుర్తించిన పోలీసులు.. నిందితుడిని అఖిలేశ్ గా అనుమానించి వారి ఇంటికి వెళ్లి వెతకగా.. అప్పటికే అతడు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.