లాక్ డౌన్ కారణంగా గృహహింస పెరిగిపోతుంది. అసలే దేశంలో మహిళలపై గృహ హింస తగ్గలేదు. కరోనా లాక్‌డౌన్ మహిళలకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఫలితంగా దేశమంతా ఇప్పుడు ఇంట్లోనే బంద్ అయ్యింది. కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే వుండిపోతున్నారు. ఫలితంగా మహిళలకు శారీరక శ్రమ ఎక్కువ అయ్యింది.
గంటకోసారి కాఫీనో, టీనో, స్నాక్సో అడిగే భర్త ఒకవైపు. స్నాక్స్ చేసిపెట్టమని పిల్లలు మరోవైపు అడుగుతున్నారు. ఇలా ఇంటి పనులతో ఊపిరాడకుండా గడిపేస్తున్నారు కొంత మంది మహిళలు. ఇక ఇళ్లకే పరిమితమైన కొందరు మగవారు ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఆ మద్యం అందుబాటులో లేక పిచ్చివారిగా ప్రవర్తిస్తున్నారు.
ఆ అసహానాన్ని భార్యలపై చూపిస్తున్నారు. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఒక్క వారంలోనే గృహహింసకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ)కి మొత్తం 58 ఫిర్యాదులు అందాయట. వీటిని బట్టి మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. అయితే ఈ కేసులన్నీ ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల నుంచే వున్నాయట. మరీ ముఖ్యంగా పంజాబ్ నుంచి వచ్చాయని ఎన్‌పీడబ్ల్యూ ఛైర్ పర్సన్ రేఖా శర్మ అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న అలజడిలో మహిళలను నిర్లక్ష్యం చేయొద్దని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. కరోనా పోరాటంతో పాటుగా మహిళా సంక్షేమానికి కూడా ప్రాముఖ్యత నివ్వాలని సభ్యదేశాలకు సూచించారు. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా కారణంగా.. ముఖ్యంగా మహిళలు, బాలికలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు.
దశాబ్దాలపాటు కృషి చేస్తేనే లింగ సమానత్వం సాధ్యమైందని, ఈ విపత్కర పరిస్థితుల్లో లింగ సమానత్వం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుటెరస్ చెప్పారు. వివిధ దేశాల్లో లాక్‌డౌన్లు విధించడం వల్ల ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయింది మహిళలేనని, కావున ఆర్థిక రంగం కూడా వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.