Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'అశోక చక్ర' కల్నల్ ఫ్యామిలీకి తీవ్ర అవమానం.. ఫైరవుతున్న నెటిజన్లు

'అశోక చక్ర' కల్నల్ ఫ్యామిలీకి తీవ్ర అవమానం.. ఫైరవుతున్న నెటిజన్లు
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (18:31 IST)
దేశంలోనే మూడో అత్యున్నత శౌర పురస్కారమైన అశోకచక్ర గ్రహీత కల్నల్ ఫ్యామిలీకి తీరని అవమానం జరిగింది. కేన్సర్ వ్యాధితో మృతి చెందిన కుమారుడిని చివరి చూపు చూసేందుకు ఆ కల్నల్ తల్లిదండ్రులు ఏకంగా 2600 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం చేయాల్సిన దుస్థితిని మన ప్రభుత్వ అధికారులు కల్పించారు. ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు తమదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. 
 
ఆయన పేరు ఎన్.ఎస్ బల్. ఆర్మీలో ప్రత్యేక దళాల విభాగంలో పని చేస్తూ సమర్థుడైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపు కారణంగానే దేశంలో మూడో అత్యున్నత పురస్కారమైన అశోక చక్రను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. అయితే, 39 యేళ్ల ఈ ఆర్మీ అధికారి కేన్సర్ కారణంగా శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు తమ తనయుడిని కడసారి చూసుకోవాలన్న ఆశతో పుట్టెడు దుఃఖంతో అధికారులను సంప్రదించారు. అమృతసర్ నుంచి బెంగుళూరుకు వెళ్లేందుకు ఆర్మీ విమానాన్ని సమకూర్చాలని ప్రాధేయపడ్డారు. కానీ లాక్‌డౌన్ అమల్లోవుందని, తామేమీ సాయం చేయలేమని చేతులెత్తేశారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఏకంగా 2600 కిలోమీటర్లు రోడ్డు మార్గంలోనే ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. 
 
వాస్తవానికి కల్నల్ బల్ మృతదేహాన్ని సైనిక విమానం ద్వారా స్వస్థలం అమృత్‌సర్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, కల్నల్ తల్లిదండ్రులు మాత్రం బెంగుళూరులోనే అంత్యక్రియలు జరుపుతామని అధికారులకు చెప్పారు. నిజానికి సైనిక విమానాల్లో మృతదేహాలను వెంటనే తరలించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆర్మీ అధికారి బంధువులకు, పోలీసు బలగాలకు విమాన సర్వీసులను కేటాయించేందుకు నిబంధనలు ఒప్పుకోవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 
 
దీంతో చేసేదేంలేక ఆ కల్నల్ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డు మార్గంలో అమృతసర్ నుంచి బెంగుళూరుకు కారులో బయలుదేరారు. తాము రోడ్డు ప్రయాణంలో బెంగుళూరుకు వస్తున్నట్టు కల్నల్ బల్ సోదరుడు నవతేజ్ సింగ్ బల్ ట్విటర్లో చెప్పడంతో మాజీ ఆర్మీ అధికారులు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. 
 
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీపీ మలిక్ ట్విటర్లో ఘాటుగా స్పందించారు. 'మీకు నా ప్రగాఢ సానుభూతి. క్షేమంగా వెళ్లండి. మీ విషయంలో భారత ప్రభుత్వం సహాయం చేయకపోవడం విచారకరం. చట్టాలు ఎప్పుడూ రాళ్లపై చెక్కరు. ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని సవరించడం లేదా మార్చడం చెయ్యొచ్చు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్: లాక్ డౌన్ ఎత్తేస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది - ప్రపంచ దేశాలకు WHO హెచ్చరిక