మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో బాంబు దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించి వచ్చిన ఓ దండుగుడు ఈ బాంబు దాడికి పాల్పడ్డాడు. అయితే, అదృష్టవశాత్తు ఈ రెండు బాంబులు పేలకపోవడంతో పెను విపత్తు తప్పింది. బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.
రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం గేటు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి వరుసగా రెండు బాంబులను ఒకదాని తర్వాత ఒకటి విసిరాడు. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. అక్కడున్న వాళ్ళు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారి నుంచి తప్పించుకుని బైకుపై పారిపోయాడు. క్యాంటీన్ బయట ఈ దాడి జరిగింది.
అదేసమయంలో ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బాంబు దాడి వార్త తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పేలకుండా ఉన్న రెండు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రమేష్ గౌరవ్ మాట్లాడుతూ, యూనివర్శిటీలోని క్యాంటీన్ బయట గుర్తు తెలియని వ్యక్ి బాంబులు విసిరినట్టు తమకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకుని దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలించాం. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నాం" అని చెప్పారు.