Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు : కేవలం 48 ఓట్ల తేడాతో గెలుపు

vote

వరుణ్

, బుధవారం, 5 జూన్ 2024 (13:55 IST)
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుని 234 సీట్ల వద్ద ఆగింది. గతంతో పోల్చితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా వంద సీట్ల వరకు దక్కించుకుంది. 
 
మొత్తం ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కొందరు గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించగా.. కొందరు ఉత్కంఠ పోరులో త్రుటిలో గట్టెక్కగలిగారు. మహారాష్ట్రలో ఓ అభ్యర్థిని కేవలం 48 ఓట్ల తేడాతో గెలుపు వరించింది. 
 
మహారాష్ట్రలోని ముంబై నార్త్‌ వెస్ట్‌ స్థానం నుంచి ఏక్‌నాథ్‌ శిండే నేతృత్వంలోని శివసేన పార్టీ తరఫున రవీంద్ర దత్తారామ్‌ వైకర్‌ పోటీ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి అన్మోల్‌ కీర్తికర్‌ నిలబడ్డారు. వీరి మధ్య ఆద్యంతం గెలుపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 4,52,644 ఓట్లు రాగా.. ప్రత్యర్థి అన్మోల్‌కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 15,161 ఓట్లు పడటం గమనార్హం.
 
కేరళలోని అత్తింగళ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్వొకేట్‌ అదూర్‌ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థిపై 684 ఓట్లతో నెగ్గారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. 3,27,367 ఓట్లతో సీపీఎం అభ్యర్థి వి.జాయ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి.
 
ఒడిశాలోని జయపురంలో భాజపా అభ్యర్థి రబీంద్ర నారాయణ్‌ బెహరా (5,34,239 ఓట్లు).. తన సమీప బిజు జనతాదళ్‌ అభ్యర్థి శర్మిష్ఠా సేథి (5,32,652)పై 1587 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీకి బయల్దేరిన చంద్రబాబు, పవన్‌