ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ధాటికి వైకాపా కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమి బాటలో సాగుతున్నారు. ఓటమి బాటలో ఉన్న మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉష శ్రీచరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.
మరోవైపు జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తూర్పుగోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగరంలో 9కి 8, పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.