మద్యం మత్తులో ఓ ఐఏఎస్ అధికారి బీభత్సం సృష్టించాడు. మితి మీరిన వేగంతో కారు నడుపుతూ... అందులోనూ పరిమితికి మించి మద్యం సేవించి కారు నడిపాడు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన శ్రీరామ్ వెంకటరామన్ అనే ఐఏఎస్ అధికారి కారు వేగంగా నడిపి బైక్‌పై వెళ్తున్న పాత్రికేయుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రముఖ మలయాళ పత్రిక ‘సిరాజ్’ బ్యూరో ఛీఫ్ మహమ్మద్ బషీర్(35) మృతి చెందారు.
శనివారం తెల్లవారుజామున త్రివేండ్రం మ్యూజియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో.... బైక్ 100 మీటర్ల దూరంలో ఎగిరిపడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న బషీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించారు.
వెంకటరామన్ మోతాదుకి మించి మద్యం సేవించినట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అయితే తాను కారు నడపలేదని, తన స్నేహితురాలే నడిపారని పోలీసులకు ఐఏఎస్ అధికారి వాంగ్మూలమిచ్చారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం దీనికి భిన్నంగా చెబుతున్నారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించి పోలీసులు ఓ నిర్ణయానికి రానున్నారు.