తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివగంత జయలలిత మృతిపై ఉన్న మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కానీ, ఆమె మరణంపై రోజుకో సందేహం ఉత్పన్నమవుతోంది. తాజాగా డాక్టర్ మ్యాథ్యూ శామ్యూల్ ఇచ్చిన వాంగ్మూలం లీకైంది. ఇందులో జయలలిత గత 2015 నుంచే గుండెలో మిట్రల్ వాల్వ్ (ద్వికపర్ది కవాటము) పెరుగుతూ వచ్చిందని ఆయన వెల్లడించారు. దీంతో జయలలిత మృతి కేసులో కొత్త కోణం వెలుగుచూసినట్టయింది.
జయలలిత మృతిపై ఉన్న మిస్టరీని ఛేదించేందుకు తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గత యేడాది కాలంగా విచారణ జరుపుతోంది. ఈ విచారణలో భాగంగా, పలువురు మంత్రులు, వైద్యులు, అపోలో ఆస్పత్రి వైద్యుల వద్ద విచారణ జరపడం జరిగింది.
జయలలితకు మెరుగైన వైద్య సేవలు అందించకుండా అపోలో ఆస్పత్రితో శశికళ నటరాజన్ కుమ్మక్కయ్యారని అన్నాడీఎంకే శ్రేణులతో పాటు.. జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇటీవలే ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో డాక్టర్ మ్యాథ్యూ శామ్యూల్ వాంగ్మూలం బయటకు రావడం గమనార్హం. ఈయన 2018 నవంబరు 20న ఈ వాంగ్మూలం ఇచ్చారు.
జయ మరణానికి దారితీసిన పరిస్థితులపై ఆయన చెప్పిన కీలక అభిప్రాయాలు అందులో ఉన్నా యి. అంతేకాదు.. ఆస్పత్రిలో ఉండగా డాక్టర్ మాథ్యూని చూడటానికి జయలలిత నిరాకరించడం గమనార్హం. '2016 అక్టోబరు 25న నేను అపోలో ఆస్పత్రిలోని జయలలిత గది దగ్గరకు వెళ్లాను. అప్పుడు ఉదయం 8.45 గంటలైంది. జయ బాత్రూమ్‌కు వెళ్లారు. ఆ రోజు నన్ను చూడాలనుకొవడం లేదని జయ బదులిచ్చారు. తర్వాతి రోజు నేను వేరు ఊరు వెళ్లాను. జయకు యాంజియోగ్రామ్ అవసరమో లేదో సలహా అడగడానికి నన్ను పిలిచారు' అని మాథ్యూ చెప్పారు.