మా నాన్న ఈ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన పదవిలో లేనపుడు ఎల్టీటీఈ తీవ్రవాదులు మానవబాంబులుగా మారి హత్య చేశారు. వారిని కూడా ఎపుడో క్షమించేశాం. వారిపై రవ్వంత కూడా కోపం లేదని కాంగ్రెస్ నేత, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ అన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. దీంతో రాహుల్ గాంధీ తరచుగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఆయన పాండిచ్చేరిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, అక్కడి భారతీదాసన్ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. మీ నాన్నగారిని హత్యచేసిన ఎల్టీటీఈ వ్యక్తులపై మీ అభిప్రాయమేంటి? అన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. తన తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని అన్నారు.
తను ఎవరైనా కోపం కానీ, ద్వేషం కానీ లేదని అన్నారు. హింస వల్ల ఎవరికీ ఒరిగేదేమీ ఉండదని అన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారిని తాను క్షమించానని అన్నారు. తన తండ్రి తనలోనే, తనతోనే ఉన్నారని, తన ద్వారా మాట్లాడుతున్నారని రాహుల్ అన్నారు.
కాగా, రాజీవ్ హంతకుల విడుదల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్న విషయం తెల్సిందే. వీరిని విడుదల చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాయి. ఈ దోషుల విడుదల అంశంపై సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర గవర్నరుకు డెడ్‌లైన్ విధించింది. అయితే, దోషుల విడుదల అంశం తన పరిధిలోలేదని, రాష్ట్రపతికే ఆ అధికారం ఉందని గవర్నర్ తోసిపుచ్చారు.