గతంలో ఓ బాలుడి తల వంట సామానులో చిక్కుకున్న వార్త వైరల్ అయ్యింది. తాజాగా పొరపాటున చిన్నారి తల ప్రెజర్ కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. తల కుక్కర్లో ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి నానా తంటాలు పడ్డాడు.
దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తలను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తల బయటకు వచ్చేలా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలించలేదు. ఇలా కాదని వెంటనే ఆస్పత్రికి పరుగున వెళ్లారు. వైద్యులు మొదట ఆశ్చర్యానికి గురయి అనంతరం అత్యంత జాగ్రత్తతో కుక్కర్‌ను తొలగించి చిన్నారి తలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.
వివరాల్లోకి వెళితే.. ఆగ్రా లోహమండి ప్రాంతంలోని ఖటిపరాలో ఉన్న మేనమామ ఇంటికి కుటుంబసభ్యులు వచ్చారు. తమతోపాటు 18 నెలల చిన్నారిని వెంట తీసుకున్నారు. ఇంట్లో అందరూ తమ పనుల్లో మునిగి ఉండగా ఈ చిన్నారి ఆడుకుంటున్నాడు.
ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రెజర్ కుక్కర్‌తో ఆడుకుంటుండగా పొరపాటున తల కుక్కర్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
అతికష్టమ్మీద దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి విజయవంతంగా చిన్నారి తలను బయటకు తీశారు. ఈ చికిత్సకు వైద్యులు ఒక్క రూపాయి మాత్రమే ఫీజుగా తీసుకోవడం విశేషం.