యాసిడ్ దాడి, అత్యాచారం, లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో చికిత్స చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఉచిత వైద్యంలో భాగంగా మెడికల్ పరీక్షలు కూడా డబ్బులు తీసుకోకుండా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
లైంగిక దాడుల బాధితులకు చికిత్స నిరాకరించడం చట్ట రీత్యా నేరమని, సంబంధిత హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మేనేజ్మెంట్ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. 16 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు జడ్జిలు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
లైంగిక దాడుల నుంచి బయటపడిన బాధితులు ఉచిత వైద్య చికిత్స విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. ఉచిత చికిత్సలో భాగంగా అవసరమైన అన్ని పరీక్షలు, రోగ నిర్ధారణ టెస్టులు చేయడంతో పాటు దీర్ఘకాలిక వైద్య సంరక్షణ కూడా అందించాలని స్పష్టం చేసింది. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.