Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరాఖండ్‌ రాజకీయం : నేడు హరీశ్ రావత్‌ సర్కారుకు బలపరీక్ష

Advertiesment
ఉత్తరాఖండ్‌ రాజకీయం : నేడు హరీశ్ రావత్‌ సర్కారుకు బలపరీక్ష
, మంగళవారం, 10 మే 2016 (08:32 IST)
ఉత్తరాఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తిరుగుబాటుకు చేసిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ విధించిన సస్పెన్షన్ వేటు సరైనదేనంటూ హైకోర్టుతో పాటు.. సుప్రీంకోర్టు స్పష్టంచేశాయి. దీంతో మాజీ సీఎం హరీశ్‌ రావత్ సర్కారు మంగళవారం ఎదుర్కోనున్న విశ్వాస పరీక్షలో ఆ 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓటువేసే వీల్లేదని సుప్రీం ధర్మాసనం రూలింగ్ ఇచ్చింది. ఈ రూలింగ్‌తో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తలబొప్పికట్టినట్టయింది. 
 
అంతకుముందు ఉదయం.. రెబెల్స్‌పై స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ కుజ్వాల్‌ అనర్హత వేటు వేయడాన్ని హైకోర్టు సమర్థించింది. దీనిపై వారు ఆగమేఘాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే కోరగా, చీఫ్‌ జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఈ కేసును జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ శివకీర్తిసింగ్‌ల ధర్మాసనానికి అప్పగించారు. దీనిపై సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తూ... హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆ 9 మందీ ఓటింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. 
 
ఈ పరిణామంతో కమలనాథులు ఖంగుతిన్నారు. అదేసమయంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీలో సంఖ్యాబలం 70 నుంచి 61కి తగ్గింది. కాంగ్రెస్‌ బలం స్పీకర్‌తో కలిపి 27 కాగా, బీఎస్పీ సభ్యులు ఇద్దరు, యూకేడీ సభ్యుడొకరు, ముగ్గురు స్వతంత్రులు రావత్‌కు మద్దతిస్తున్నారు. ఇక బీజేపీ బలం 28 కాగా ఒక సభ్యుడు భీమ్‌లాల్‌ ఆర్యను పార్టీ సస్పెండ్‌ చేసింది. దీంతో ఆయన రావత్‌కు అనుకూలంగా ఓటేసే అవకాశముంది. ఈ పరిస్థితిలో రావత్ బలపరీక్ష నెగ్గాలంటే 32 మంది మద్దతు అవసరం కాగా, స్పీకర్‌ సహా 34 మంది రావత్ వెంట ఉండటంతో సునాయాసంగా విశ్వాస పరీక్షలో నెగ్గుతామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 
 
మరోవైపు... ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో వుంది. ఈ నేపథ్యంలో బలపరీక్ష నిర్వహణ కోసం మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటదాకా రాష్ట్రపతి పాలనను కేంద్రం సడలించింది. ఈ ప్రక్రియను శాసనసభ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి పర్యవేక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కార్యకలాపాలను వీడియో తీయించి, రికార్డింగుతోపాటు ఫలితాన్ని సీల్డ్‌ కవర్‌లో బుధవారం ఉదయం 11:30 గంటలకు తమ ముందుంచాలని నిర్దేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం మ‌హానాడు టీం రెడీ...