ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా చిక్కుల్లో పడిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం "ఆపరేషన్ గంగ" అనే పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, విద్యార్థులను సరిహద్దు దేశాలైన రొమేనియా, పోలాండ్ తదితర దేశాలకు తరలించి అక్కడ నుంచి స్వదేశానికి తీసుకొస్తుంది.
ఈ 'ఆపరేషన్ గంగ'లో భాగంగా తొలి విమానం తొలుత ముంబైకు వచ్చింది. ఆ తర్వాత రెండో విమానం ఢిల్లీకి, మూడో విమానం హైదరాబాద్‌కు చేరుకోగా, నాలుగు, ఐదు విమానాలు ఢిల్లీకి వచ్చాయి.
తాజాగా ఢిల్లీకి వచ్చిన ఐదో విమానంలో 249 మంది విద్యార్థులు, పౌరులు సురక్షితంగా మాతృభూమికి చేరుకున్నారు. వీరిలో ఏపీ, తెలంగాణాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. తెలంగాణాకు చెందిన 11 మంది, ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.