సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ ద్వారా నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర ఫోటోలు పంపుతూ వేధించాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబంతో పాటు ఈసీఐఎల్‌లో నివాసం ఉంటుంది.
ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి ద్వారా సంతోష్‌నగర్‌లోని రియాసత్‌నగర్‌కు చెందిన ఎండీ అజహర్‌ఖాన్ అనే యువకుడు ఎఫ్‌బీలో పరిచయం అయ్యాడు. అజహర్‌ఖాన్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ ద్వారా సదరు మహిళకు దగ్గరయ్యాడు. తరచూ ఆమెతో చాటింగ్ చేసేవాడు. ఛాటింగ్ సమయంలో అజహర్‌ఖాన్‌తో దురుసుగా వ్యవహరించిందని కక్ష పెంచుకున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 13 తేదీ నుండి ఫేస్‌బుక్‌లో ఆమెకు అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపుతున్నాడు. అంతేకాదు ఇంటర్నెట్‌లోని నగ్న చిత్రాలను ఆ మహిళ ముఖాన్ని మార్పింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.
ఈ ఫోటోలు తీయమని అతడిని కోరినా.. ఆ వ్యక్తి పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాచకొండ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నిందితుడు ఉపయోగించి కంప్యూటర్, మొబైల్ ఆధారంగా మంగళవారం నాడు అతడిని అరెస్ట్ చేశారు.