కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే.. వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే.. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనే అపోహ కారణంగా చాలా మందికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడటం లేదు.
దీన్ని దృష్టిలో పెటుకుని గుజరాత్‌లో ప్రజలు టీకా వేయించుకునేలా ప్రోత్సహించేందుకు స్వర్ణ కారుల సంఘం వినూత్న ప్రయత్నం చేసింది. గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన స్వర్ణకారుల సంఘం.. టీకా వేసుకున్న వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ప్రకటించింది.
ప్రకటించడమే కాదు.. ఆ బహుమతులు కూడా ఇస్తోంది. కరోనా టీకా వేసుకున్న మహిళలకు ఏకంగా బంగారంతో చేసిన ముక్కుపుడకలు, అదే సమయంలోపురుషులకు హ్యాండ్ బ్లెండర్లు, ఇతర వంటింటి సామాగ్రిని అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి రాజ్‌కోట్‌లోని టీకా కేంద్రంలో స్వర్ణకారుల సంఘం శ్రీకారం చుట్టింది.