భారత్‌లో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నా గత 24 గంటల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 896 పాజిటివ్ కేసులు నమోదైనాయి. భారత్‌లో 24 గంటల్లో 37 మంది కరోనా బారిన పడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
భారత్‌లో తాజా కేసులతో కలిపి మొత్తం ఇప్పటివరకూ 6,761 పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్రం తెలిపింది. ఇందులో 6039 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. భారత్‌లో కరోనా సోకి ఇప్పటిదాకా 206 మంది చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పటివరకు 20,473 మంది విదేశీయులను వారి స్వదేశాలకు తరలించామని విదేశాంగశాఖ ప్రకటించింది. వివిధ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరవై వేలకు పైగా విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించామని, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.