దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గడచిన 24 గంటల్లో ఏకంగా 678 పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని ఇప్పటివరకు మన దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసులు 6671కు చేరుకున్నాయి. అలాగే, గత 24 గంటల్లో 33 మంది మరణించగా, ఈ సంఖ్య 206కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాక సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ సంక్రమణ రేటు మన దేశంలో తక్కువగా ఉందన్నారు. గురువారం రోజున సుమారు 16002 కరోనా పరీక్షలు చేపట్టినట్లు చెప్పారు. దాంట్లో కేవలం 0.2 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
శాంపిళ్లు సేకరించిన ఆధారంగా, ఇన్‌ఫెక్షన్ రేటు పెద్దగా లేదని అగర్వాల్ తెలిపారు. రాపిడ్ డయాగ్నస్టిక్స్ కిట్స్‌ను అందరికీ పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు దేశంలో ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరగలేదన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కానీ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అగర్వాల్ తెలిపారు.
ఇకపోతే, మనదేశంలో కావాల్సినంత హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వలు ఉన్నట్లు కేంద్ర విదేశాంగశాఖ కోఆర్డినేటర్ దమ్ము రవి తెలిపారు. చాలా వరకు దేశాలు ఆ డ్రగ్ కావాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయని, కానీ మనకు కావాల్సినంత మన దగ్గర ఉంచుకుని, ఇతర దేశాలకు అవసరం మేరకు సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.