పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో బీజేపీ యువ నాయకురాలు పమేలా గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని న్యూ అలీపూర్‌లో బీజేపీ యువ నాయకురాలు పమేలా గోస్వామి నుంచి 100 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆమె సరఫరాదారు ప్రబీర్ డేతో కలిసి తన కారులో ఉన్నప్పుడు గోస్వామిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పమేలా గోస్వామి హ్యాండ్‌బ్యాగ్ మరియు కారులోని ఇతర భాగాలలో కొకైన్ దొరికిందని పోలీసులు చెప్పారు. ఆమె కొంతకాలంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఇంకా ఆమెతో పాటు కారులో ఉన్న యువ మోర్చాకు చెందిన స్నేహితుడు, సహోద్యోగి - ప్రబీర్ కుమార్ డే కూడా అరెస్టయ్యారు. కారు సీటు కింద, పర్సులో కోకైన్ వున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బీజేపీకి చెందిన సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ, చట్టం తన పని చేసుకుపోతుందని.. కాని కొకైన్‌ను కారులో ఎవరో పెట్టారా? అనేది ఇంకా తెలియాల్సి వుందని చెప్పారు. కాగా.. ఎంఎస్ గోస్వామి 2019లో బిజెపిలో చేరడానికి ముందు ఎయిర్ హోస్టెస్, మోడల్, టివి సీరియల్ నటిగా పనిచేసింది. తరువాత ఆమెను యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా మరియు హుగ్లీ జిల్లాకు యువ మోర్చా పరిశీలకుడిగా నియమించారు