యువతికి రైలు ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువతి ఆఫీస్ ముగిసిన తర్వాత రైలులో కేజీఎఫ్ పట్టణానికి బయలుదేరింది.
ప్రయాణంలో ఆమె నిద్రపోతున్న సమయంలో వెనుకసీటులో కూర్చున్న ఓ వ్యక్తి ఆ యువతి వెనుకభాగాన్ని తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు మెల్కొన్న ఆ యువతి అతడిని ప్రశ్నించింది. దీంతో ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయాడు.
అతని వికృత చేష్టలకు విసిగిపోయిన ఆ యువతి పక్క బోగీలో తన స్నేహితులు ఉండటంతో వారిని పిలిచింది. స్నేహితులు వచ్చేలోపే ఆ వ్యక్తి వైట్‌ఫీల్డ్ స్టేషన్‌లో దిగి పారిపోయాడు. ఈ సంఘటనపై వైట్‌ఫీల్డ్ పోలీసులకు ఆ ఉద్యోగిని ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది.
కానీ వాళ్ళు ఆమె ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకపోగా ఇది తమ పరిధిలోకి రాదని చెప్పి మరొక స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ చేయమని చెప్పారు. అక్కడి పోలీసులు కూడా ఇలాంటి సమాధానమే చెప్పి, ఆ ఘటన తమ పరిధిలోకి రాదని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ అక్కడి నుంచి పంపించేశారు.
దీంతో ఆ యువతి చేసేది ఏమిలేక కంటోన్మెంట్ పోలీసులకు ఘటన గురించి వివరించి కేసు నమోదు చేసుకోవాలంటూ కోరింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా ఆ వ్యక్తి ఫోటో ఉందా, అడ్రస్ ఉందా, వ్యక్తి ఎవరంటూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో తన బాధను వెళ్లగక్కింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.